ముక్కంటి ఆలయంలో నిర్వహించే ఉత్సవాల్లో ఇదో వినోదాత్మక ఉత్సవం. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీసోమస్కంధమూర్తి, జ్ఞానాంబికలతో పాటు తొండమండలాన్ని పరిపాలించిన తొండమనాడు చక్రవర్తి ఉత్సవమూర్తిని చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు. పూర్వం ఇక్కడి ప్రాంతం తొండమాన్ చక్రవర్తి పరిపాలనలో ఉండేది. ఆ సమయంలో స్వామి, అమ్మవార్ల విలువైన ఆభరణాలు, పట్టుచీరలు దొంగలు అపహరించడం, ఈ విషయాన్ని తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి మారువేషంలో వెళ్లి దొంగలు దోచుకెళ్లిన ఆభరణాలు, పట్టుచీరలను తిరిగి తీసుకువచ్చి స్వామి, అమ్మవార్లకు సమర్పిస్తారు. అప్పటి నుంచి ఈ విశేషోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఈ విశేషోత్సవాన్ని పుర్కరించుకుని ముందుగా చతుర్మాడ వీధులను కలుపుతూ ఉన్న చిన్నపాటి వీధుల్లోకి తొండమాన్ చక్రవర్తి ఉత్సవమూర్తిని తీసుకెళ్లడం, ఉత్సవమూర్తులు అక్కడకు సమీపించగానే అర్చకులు, పరిచారకులు ఆయన వద్ద నుంచి పట్టుచీరలు స్వామి, అమ్మవార్ల వద్ద పెట్టి వాళ్లకు ప్రదక్షిణంగా దొంగ.. దొంగా.. దొంగలను పట్టుకోండంటూ ఊరేగింపుగా తీసుకెళ్లడం ఇలా ఉత్సవం ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కరుణాగురుకుల్‌తో పాటు తనిఖీ అధికారి సారథి పాల్గొన్నారు. ఈ ఘట్టం భక్తులందరికి తెలిసే విధంగా ఈ దఫా ప్రత్యేకంగా మైకులు ఏర్పాటు చేశారు.